Sunday, January 15, 2012

ఆరంభం

ఆరంభం
నా బ్లాగోతానికి ఏం పేరు  పెట్టాలా అనే ఆలోచనలతో అసలు బ్లాగే మొదలు పెట్టకుండా  ఆరు నెలలు గడిచిపొయాయి. చివరకు హైదరాబాదు పుస్తక ప్రదర్శన లొ ఇ - తెలుగు వారి 'బలవంతం' తో ఎలాగైతేనేం నా బ్లాగుని సృష్టించటంతో "ఆరంభింపరు నీచ మానవు" లన్న నింద నుంచి తప్పించుకొన్నాను. 
బ్లాగులు అలవోకగా నీళ్ళలా ప్రవహించాలనే దురాశతో ఏటిగట్టు అని పేరైతే   పెట్టానుగానీ ఒక్క చుక్కైనా రాలందే! (బహుశా ఇది ఏ రాయలసీమలోని వాగో వంకో అయ్యుంటుంది). సరే కనీసం మొదలైతే పెట్టానుగా, క్రొత్త సంవత్సరం నుంచి విజృంభించేద్దాం అని  అలా  అలా  మరో వారం  రోజులు వాయిదా వేశాను. జనవరి ఫస్టుకల్లా మొదటి టపా పడిపోవాలని నాకు నేనే చావురేఖ పెట్టుకొని, ఆరోజుకి  గనక వ్రాయక పోతే రాష్ట్రం అగ్నిగుండం  అవుతుందని హెచ్చరించుకొని ఆ వంకతో మా ఆవిడనుంచి నాలుగు రోజులపాటు రోజూ మరో రెండు కాఫీలు అదనంగా సంపాదించేసాను.  కానీ ఈలోగా  కొత్తగా కొన్న పుస్తకాలు చదవటంలో మునిగిపోవటంతో అసలు విషయం  అటకెక్కేసింది.
పది రోజుల తరువాత అకస్మాత్తుగా నాకు నా మొదటి టపా ఇంకా వ్రాయలేదన్న సంగతి గుర్తొచ్చి రంగంలోకి దిగిపోయాను.. వెంటనే కలం, కాగితం, లాప్ టాప్ లతో  ఏటిగట్టుకి చేరిపోయాను. ప్రవాహం కాదు కదా కనీసం తడి కూడా తగులుతున్న దాఖలాలు లేవు.   వీళ్ళందరూ పుంఖాను పుంఖాలుగా ఎలా వ్రాస్తారో కదా అనుకుంటూ చింతాక్రాంతుడినై, విషణ్ణ వదనంతో (అబ్బో...పెద్ద పెద్ద పదాలు దొర్లటం మొదలైందండోయ్) సోంచాయిస్తుండగా నే (ఛీ ఛీ మధ్యలో ఏమిటీ భాషా ద్రోహం)  మరో రోజు గడిచిపోయి భోగి పండగ కూడా వచ్చేసింది.          
క్రొత్త సంవత్సరంవెళ్ళిపోయింది. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఇక సచిన్ వందో వంద ముందు కొడతాడా లెక నా టపా ముందు తయారవుతుందా చూద్దామని తెల్లవారుఝామున 8 గంటలకల్లా లేచి టి.వి. పెట్టగానే నాదే విజయం అని తెలిసిపోయింది. చివరకు కనీసం నా తొలి బ్లాగు కష్టాలనే ఇతర సీనియర్ బ్లాగవతోత్తములతో పంచుకుందామని ఇలా మొదలు  పెట్టేశాను.  తెలుగువారందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.  సరైన విషయంతో మరో టపాలో  త్వరలో కలుద్దాం. శలవు.